ఆగస్టు 23న ప్రపంచ జానపద దినోత్సవం
నిజామాబాద్, ప్రపంచ జానపద కళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 23న నిజాం అంబేద్కర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు జానపద కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక జిల్లా అధ్యక్షులు సిరిప లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ప్రకటించారు.
ఈ మేరకు ఆగస్టు 19న నిజామాబాద్‌లోని పెన్షనర్స్ భవన్లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 150 మంది కళాకారులతో జానపద నృత్యాలు, సింధు, ఒగ్గు, కోలాటం, భజన తదితర ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జానపద కళలను రక్షించడంలో విశేష కృషి చేసిన వారికి వేదిక తరఫున గౌరవ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వారు ప్రకటించారు. ప్రజా కళలను సంరక్షించడమే కాకుండా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పేద కళాకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలనే డిమాండ్‌ను కూడా వారు ఉంచారు.
“ప్రజా కళలు సంస్కృతి, సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత” అని వేదిక నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సాయిబాబా, గంగాధర్, రాధా కిషన్, నర్సారెడ్డి, చంద్రశేఖర్, పురుషోత్తం, విజయమాల, అంజన్న, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment