-->

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి


న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి (79) పేరును అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వివరాలను వెల్లడించారు.

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామానికి చెందినవారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, 1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

2007 జనవరి 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, సుమారు నాలుగున్నరేళ్లు సేవలందించారు. ఈ కాలంలో నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా “సాల్వా జుడుమ్” పేరుతో గిరిజన యువకులను మావోయిస్టులపై నియమించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చారు.

2011 జూలై 8న సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవి నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం గోవా రాష్ట్రానికి మొట్టమొదటి లోకాయుక్తగా పనిచేశారు. తాజాగా, 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ (IAMC) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793