🚘 ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు ఊహించని డిమాండ్
న్యూఢిల్లీ, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు అపూర్వ స్పందన లభించింది. ప్రారంభ రోజైన ఆగస్టు 15న సాయంత్రం 7 గంటల వరకూ దాదాపు 1.4 లక్షల మంది వాహనదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 1,150కి పైగా టోల్‌ప్లాజాల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించిన వెంటనే భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయి. అదే రోజు 1.39 లక్షలకుపైగా లావాదేవీలు నమోదయ్యాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ సందర్భంగా రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఒకేసారి 20-25 వేల మంది వినియోగదారులు లాగిన్ అయినట్లు అధికారులు వివరించారు.
📌 ఫాస్టాగ్ వార్షిక పాస్ ముఖ్యాంశాలు:
- ధర: రూ.3,000
- వర్తింపు వాహనాలు: వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లు
- కాలపరిమితి: ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది)
- వాణిజ్య వాహనాలకు వర్తించదు
- 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ.3,000 చెల్లించి యాక్టివేట్ చేసుకోవచ్చు.
- ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్తది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
- యాక్టివేషన్ విధానం: రాజ్‌మార్గ్ యాత్ర యాప్, NHAI లేదా మోర్త్ వెబ్‌సైట్ల ద్వారా.
ఈ పాస్‌తో వాహనదారులు తరచూ టోల్ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేయవచ్చని NHAI స్పష్టం చేసింది.

Post a Comment