తెలంగాణలో మరో రెండు విమానాశ్రయాలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విమానయాన రంగానికి కొత్త ఊపు రానుంది. వరంగల్, ఆదిలాబాద్‌లో వాయు ప్రయాణ సదుపాయాలు కల్పించేందుకు ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సన్నాహాలు ప్రారంభించింది. నిలిచిపోయిన ప్రణాళికలు మళ్లీ ఊపందుకోవడంతో వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ రెండు నగరాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి.
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్
మామునూరులో ఎయిర్‌పోర్ట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున భూమి సేకరించింది. 253 ఎకరాల భూమికి గాను రూ.205 కోట్లు విడుదల చేసి ప్రాజెక్టుపై తన కట్టుబాటును చాటింది. మొదట చిన్న విమానాల రాకపోకలకే పరిమితం చేయాలని భావించినా, రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఏఏఐ పెద్ద విమానాలు, కార్గో సర్వీసులు కూడా నడిచేలా సదుపాయాలు కల్పించనుంది. దీంతో ఏ320, బోయింగ్ 737ల వంటి వాణిజ్య విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరినాటికి పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్
ఆదిలాబాద్‌లో ఇప్పటికే వాయుసేనకు చెందిన 362 ఎకరాల స్థలం ఉంది. దానిని వినియోగించుకునే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మిగతా అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఏఏఐకు అప్పగించనుంది. రెండు సంవత్సరాల్లోనే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో కసరత్తు జరుగుతోంది.
2027 నాటికి పూర్తి
తెలంగాణ ప్రభుత్వం 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా వేగం పెంచుతుండగా, కేంద్రం డిసెంబర్ వరకు గడువు పెట్టినట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తవుతే తెలంగాణలో వాయు ప్రయాణం మరింత విస్తరించనుంది.
చారిత్రక ప్రాధాన్యం ఉన్న వరంగల్
నిజాం కాలం నుంచే మామునూరులో విమానాలు ఎగిరేవి. భారత్–చైనా యుద్ధ సమయంలో కీలక సేవలు అందించిన ఈ ఎయిర్‌పోర్ట్ గత మూడు దశాబ్దాలుగా మూతపడి ఉంది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలనే ప్రయత్నం విజయవంతమైతే, వరంగల్ ప్రజల కల నిజం కానుంది.
ప్రయోజనాలు
- వరంగల్‌లో ఐటీ, ఎడ్యుకేషన్, హ్యాండ్లూమ్ రంగాల అభివృద్ధికి తోడ్పాటు.
- ఆదిలాబాద్‌లో ఖనిజ, అటవీ సంపద ఆధారిత వ్యాపారాలకు కొత్త అవకాశాలు.
- పర్యాటకానికి, వాణిజ్యానికి, పరిశ్రమలకు ఊతం.
- రాష్ట్ర రవాణా వ్యవస్థకే కాకుండా ఆర్థికాభివృద్ధికి కొత్త రెక్కలు.

Post a Comment