తెలంగాణ నెలాఖరులో స్థానిక ఎన్నికల నగారా
హైదరాబాద్: ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ చివరినాటికి ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉండటంతో ప్రభుత్వం కూడా ముందస్తు సన్నాహకాల్లోకి దిగింది. టీపీసీసీ నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు క్షేత్రస్థాయి క్యాడర్‌ను సిద్ధం చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి.
42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఆర్డినెన్స్‌లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడ్డాయి. ఆమోదం ఆలస్యమైతే పార్టీ స్థాయిలోనే 42% సీట్లు బీసీలకు కేటాయించే యోచనలో ఉంది ప్రభుత్వం. జీఓపై కోర్టు సవాళ్లు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా జీఓ జారీ చేసి, తరువాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ప్రణాళిక ఉంది.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదవులు రొటేషన్ ప్రకారమే రిజర్వు చేయనున్నారు. ఏడాదిన్నరుగా పంచాయతీలు, మండల–జిల్లా పరిషత్‌లు ఎన్నికలు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికల జాప్యం కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామీణ అభివృద్ధి ప్రభావితమైంది.
పెద్దపల్లి జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలు చేజిక్కించుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన 50% రిజర్వేషన్ నిర్ణయాన్ని, కేంద్రంపై ఒత్తిడి అంశాన్ని కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినియోగించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Post a Comment