ఆస్తి కోసం తల్లిని రోడ్డుపైనే నరికి చంపిన కసాయి కొడుకు
అమరావతి: ఆస్తి కోసం కన్న తల్లినే నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపిన ఘటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం ప్రకారం, మృతురాలు లక్ష్మీ నరసమ్మ (44) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. భర్త మృతిచెందిన తర్వాత, ఆమె ఇద్దరు పిల్లలను పెంచింది. ఇటీవల కూతురి వివాహం జరిగినప్పటికీ, కుమారుడు శివాజీ (ఇద్దరు పిల్లల తండ్రి) తరచూ తన తల్లితో సొంత ఇంటిని తన పేరుమీద రాయాలని వాదనలకు దిగేవాడు.
గతంలోనే రెండు సార్లు తల్లిపై దాడి చేయడానికి ప్రయత్నించిన శివాజీ, ఆదివారం ఉదయం మళ్లీ గొడవపడ్డాడు. ఈసారి తల్లి ఇంటి సమీపంలోనే కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమీపంలోని వ్యక్తి అడ్డుకోవడంతో కత్తి అక్కడే వదిలి పారిపోయాడు.
తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన లక్ష్మీ నరసమ్మను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శివాజీని అదుపులోకి తీసుకున్నారు..
Post a Comment