దిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండొద్దు: సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల వీధుల్లో ఇక ఒక్క కుక్క కూడా తిరగకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల దాడులు, కుక్కకాట్లు, రేబిస్ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది.
జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ తరలింపుల కోసం ఇప్పటికే ప్రదేశం గుర్తించామని, అయితే జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో పనులు నిలిచిపోయాయని కోర్టుకు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ పార్దివాలా – “ఆ జంతు ప్రేమికులందరూ కలిసి రేబిస్‌తో చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?” అని ప్రశ్నించారు.
అధికారులను ఉద్దేశించి కోర్టు – కుక్కల కోసం వెంటనే కొత్త షెల్టర్లు నిర్మించాలనీ, వీధి కుక్కలను దత్తత తీసుకునే అనుమతులు ఇవ్వొద్దనీ ఆదేశించింది. ఈ చర్యలను అడ్డుకునే ఏ వ్యక్తి లేదా సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Post a Comment