హైదరాబాద్ నగరం నడిబొడ్డున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ బీసీ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్టించనుంది. నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహానికి సోమవారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, వారిని సంఘటితం చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అయితే, బీసీ వర్గాల మద్దతు పొందడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. "బీసీ ఓటు బ్యాంక్‌నే లక్ష్యంగా చేసుకున్న వ్యూహం ఇది" అని వారు ఆరోపిస్తున్నారు.
శంకుస్థాపన అనంతరం ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
జయంతి వేడుకల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు తన నివాసంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, టి-ఫైబర్ ప్రాజెక్ట్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Post a Comment