నేడు ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ
ఢిల్లీలో ఈరోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి సమావేశం కానుంది. ప్రతిపక్ష కూటమి నేతలు ఈ భేటీలో పాల్గొని రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు.
ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ప్రతిపక్షం కూడా పోటీకి దిగాలని నిర్ణయించుకుంది. రాధాకృష్ణన్‌కు ధీటుగా నిలబెట్టగల అభ్యర్థి ఎవరనేది ఈరోజు కీలక చర్చ కానుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచే అవకాశాలు ఎన్డీఏ కూటమికే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీకి రాజ్యసభలో 102 సీట్లు ఉండగా, మిత్రపక్షాల మద్దతుతో ఆ సంఖ్య 132కి చేరింది. అదనంగా 7 నామినేటెడ్ సభ్యుల మద్దతు లభిస్తే అది 139కి పెరుగుతుంది. లోక్‌సభలో బీజేపీకి 240 సీట్లు ఉండగా, మిత్రపక్షాలతో కలిపి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ బలంతో ఉపరాష్ట్రపతి పదవి గెలుచుకోవడం ఎన్డీఏకి సులభం కానుంది.
అయితే ప్రతిపక్షం పోటీని వదిలిపెట్టే పరిస్థితి లేదు. తమ ఐక్యతను చాటిచెప్పడమే లక్ష్యంగా అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. గతంలో బీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా బీజేపీ వాటి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టకపోతే.. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసే అవకాశం ఉంది.

Post a Comment