మహారాష్ట్ర వరదలో గల్లంతైన జగిత్యాల జిల్లా వాసులు?
జగిత్యాల జిల్లా, మహారాష్ట్రలో కురుస్తున్న అతివృష్టి కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని టిఆర్ నగర్‌కు చెందిన నలుగురితో పాటు, మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే— ఆదివారం అర్ధరాత్రి ఉద్గిర్ సమీపంలో వర్షపు వరద ప్రవాహం కారు మింగేసింది. ఆ కారులో షేక్ అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, అబ్బు అనే యువకుడు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాద సమయంలో షేక్ అఫ్రీనా తన భర్త సలీంకి ఫోన్ చేసి, "మేము వరదలో కొట్టుకుపోతున్నాం… పిల్లలను మంచిగా చూసుకో" అని రోదిస్తూ చెప్పిన తర్వాత, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం స్థానికులను కలచివేసింది.
ఈ కుటుంబం బోధన్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని ఓ బాబా దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని తెలిసింది.
గల్లంతైన వారిలో అబ్బు మాత్రమే వరద నీటిలోంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నాడు. అతను కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన దుర్ఘటనను వివరించినట్టు సమాచారం.
ప్రస్తుతం సంఘటనపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. స్థానికులు, సహాయక బృందాలు గల్లంతైన వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

Post a Comment