కూతురి పెళ్లి అప్పగింతలో తీవ్ర విషాదం
భద్రాద్రి కొత్తగూడెం, కూతురి పెళ్లి ఆనందం విషాదంలోకి మారింది. కూతురి వివాహాన్ని ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపే క్రమంలో తల్లి ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం తండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం… అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్‌లాల్, కల్యాణి దంపతులు తమ కూతురు సింధు వివాహాన్ని టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన ఓ యువకుడితో ఘనంగా నిర్వహించారు. వివాహ అనంతరం అప్పగింతల కార్యక్రమం జరుగుతుండగా వధువు తల్లి కల్యాణి ఒక్కసారిగా కుప్పకూలింది.
అక్కడికక్కడ కలకలం రేగగా, కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే గుండెపోటుతో మరణించిందని ధృవీకరించారు.
ఈ ఘటనతో పెళ్లి విందు కన్నీటి మహోత్సవంగా మారింది. కూతురి కొత్త జీవితం మొదలైన రోజే తల్లి మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అబ్బాసుపురం తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.

Post a Comment