-->

థాడిచెర్ల బ్లాక్–2ను సింగరేణికే కేటాయించాలి: హెచ్‌ఎంఎస్ డిమాండ్

థాడిచెర్ల బ్లాక్–2ను సింగరేణికే కేటాయించాలి: హెచ్‌ఎంఎస్ డిమాండ్


కొత్తగూడెం : థాడిచెర్ల బ్లాక్–2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (SCCL)కే కేటాయించాలంటూ హెచ్‌ఎంఎస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హెచ్‌ఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపెల్లి కృష్ణప్రసాద్ ప్రాజెక్ట్స్ & ప్లానింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

హెచ్‌ఎంఎస్ తెలిపిన వివరాల ప్రకారం, 2012లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య థాడిచెర్ల బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారు. ఈ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, 30 సంవత్సరాల ఆయుష్షు ఉందని పేర్కొన్నారు.

అనంతరం 2024 మార్చి 8న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇంధన శాఖ కార్యదర్శి  రిజ్వీ కలిసి కేంద్ర బొగ్గు మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిశారని తెలిపారు. ఆ సమావేశంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు పెండింగ్‌లో ఉండటంతో అనుమతి ఇవ్వలేకపోతున్నామని, అవి సమర్పిస్తే థాడిచెర్ల బ్లాక్‌ను సింగరేణికి కేటాయిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా బహిరంగంగా ప్రకటించారని తెలిపారు.

అయితే, ఇప్పటివరకు పెండింగ్ పత్రాల సమర్పణపై ఎలాంటి పురోగతి కనిపించకపోవడం దురదృష్టకరమని హెచ్‌ఎంఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. థాడిచెర్ల బ్లాక్–2 ప్రారంభమైతే సింగరేణికి సంవత్సరానికి సుమారు 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని, అలాగే దాదాపు 1500 మంది శాశ్వత ఉద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో, థాడిచెర్ల బ్లాక్–2కు సంబంధించిన పెండింగ్ డాక్యుమెంట్లను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, ప్రాజెక్ట్ ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని హెచ్‌ఎంఎస్ యూనియన్ సింగరేణి యాజమాన్యాన్ని కోరింది. ఈ బ్లాక్ సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో HMS సింగరేణి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, కార్యదర్శి యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793