ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగేనా..?
తెలంగాణ | జనవరి 14: రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్స్‌ల రవాణా వంటి అంశాలపై అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులకు ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ముమ్మరం
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ పరిమితిను తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 15 శాతానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. మిగిలిన సీట్లు వెనుకబడిన తరగతులకు కేటాయించనున్నారు.
పట్టణాల్లో బీసీ జనాభా నిష్పత్తి తక్కువగా ఉండటంతో వారి కోటా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీసీ కమిషన్ కూడా సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికన వార్డులు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఖరారు చేసి, తుది నివేదికను ఎన్నికల సంఘానికి అందించనున్నారు. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది.
- మొత్తం ఓటర్లు: 52,43,023
- పురుషులు: 25,63,369
- మహిళలు: 26,80,014
- ఇతరులు (ట్రాన్స్‌జెండర్లు): 640
షాద్‌నగర్ మున్సిపాలిటీ – ఓటర్ల వివరాలు
షాద్‌నగర్ మున్సిపాలిటీలో
- మొత్తం ఓటర్లు: 53,403
- పురుషులు: 26,679
- మహిళలు: 26,723
- ఇతరులు: 1
ఇక్కడ కూడా మహిళా ఓటర్లు స్వల్పంగా అధికంగా ఉన్నారు.

Post a Comment