-->

గూగుల్‌లో ‘చోరీ ఎలా చేయాలి’ అని సెర్చ్ చేసి ఆలయ దొంగతనం

కూకట్‌పల్లి పరిధిలో ఐదుగురు నిందితుల అరెస్ట్


హైదరాబాద్: గూగుల్‌లో ఆలయాల్లో చోరీ ఎలా చేయాలనే విషయాన్ని సెర్చ్ చేసి దొంగతనానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. అర్థరాత్రి గుడిలో చోరీకి ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య, ఎం. మల్లికార్జున్, బాష్య వెంకట మోహిత్‌కుమార్, దున్నపోతుల పవన్‌ కల్యాణ్, దండి అనిల్‌ తేజ, కంభపు విజయ్, తంగిళ మణికంఠ దుర్గాప్రసాద్‌లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆలయాల్లో చోరీ ఎలా చేయాలనే విషయాన్ని గూగుల్‌లో వెతికి పూర్తి ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలను అపహరించి సూట్‌కేసులో పెట్టుకుని అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు.

ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులందరినీ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793