-->

పండుగ పూట విషాదం.. మటన్ కోసం వెళ్లి మామ–అల్లుడు మృతి

పండుగ పూట విషాదం.. మటన్ కోసం వెళ్లి మామ–అల్లుడు మృతి


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా | జనవరి 15 సంక్రాంతి పండుగ వేళ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మటన్ కొనుగోలు కోసం వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామానికి చెందిన బోర్కుట శంకర్ (50), కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన డోంగ్రే రాజశేఖర్ (22) ఈ ప్రమాదంలో మృతి చెందారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా రాజశేఖర్ మంగళవారం సాయంత్రం బెజ్జూర్ మండలం దుబ్బగూడం గ్రామంలోని అత్తగారింటికి వచ్చాడు. బుధవారం ఉదయం మామ శంకర్‌తో కలిసి బెజ్జూర్ మండలంలోని మార్తిడి గ్రామానికి మటన్ కొనుగోలు కోసం బైక్‌పై వెళ్లారు.

అక్కడి నుంచి తిరిగి దుబ్బగూడం వైపు వెళ్తున్న సమయంలో కుంటల మానేపల్లి బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో అల్లుడు రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, మామ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న కౌటాల సీఐ బి. సంతోష్ కుమార్, ఏఎస్‌ఐ మోహన్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే సంఘటన స్థలాన్ని తుమ్మలగూడ సర్పంచ్ కొండా రాంప్రసాద్, సలుపల్లి సర్పంచ్ ఏనుక శ్రీహరి, మాజీ సర్పంచ్ వెంకటి తదితరులు సందర్శించి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793