-->

మేరాజ్ యాత్ర ఉద్దేశ్యం మానవాళికి దైవ సందేశం చేరవేయడమే

మేరాజ్ యాత్ర ఉద్దేశ్యం మానవాళికి దైవ సందేశం చేరవేయడమే షేక్ అబ్దుల్ బాసిత్, జమాతే ఇస్లామి హింద్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం మిలట్రీ కాలనీ లోని మదీనా మసీదులో పవిత్ర శుక్రవారం సందర్భంగా మేరాజ్ యాత్రపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేక్ అబ్దుల్ బాసిత్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని, ఆయనే మానవుల జననం–మరణాలకు మూలకారణమని తెలిపారు. ఈ లోకంలో మానవులకు ఇచ్చిన జీవన కాలంలో చేసిన ప్రతి కార్యానికి మరణానంతరం జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందనే సత్యాన్ని మానవాళికి తెలియజేయడానికే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ పంపాడని పేర్కొన్నారు.

సమాజానికి చేరవలసిన దైవాదేశాలను అందజేయడానికి జరిగిన పరలోక యాత్రనే మేరాజ్ యాత్ర అని వివరించారు. ఈ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వర్గ–నరకాలను ప్రత్యక్షంగా చూపించారని తెలిపారు.

మేరాజ్ సందర్భంగా మానవాళికి అందించిన ముఖ్య బోధనలు ఇవని షేక్ అబ్దుల్ బాసిత్ వివరించారు:

  • సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే
  • మానవులంతా ఆయన సృష్టే; కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేవు
  • తల్లిదండ్రుల పట్ల మంచితనంతో వ్యవహరించాలి
  • బంధువులు, బాటసారులు, నిరుపేదల పట్ల విధులను నిర్వర్తించాలి
  • వృథా ఖర్చు చేయకూడదు, అలాగే కఠిన పిసినారితనాన్ని కూడా పాటించకూడదు
  • వ్యభిచారం దరిదాపుల్లోకైనా పోకూడదు – అది మహా పాపం
  • పేదరిక భయంతో సంతాన హత్య చేయకూడదు
  • వడ్డీ తీసుకోవడం, ఇవ్వడం మహా పాపం
  • అనాథలను ఆదుకోవాలి
  • కొలతలు, తూకాల్లో మోసం చేయకూడదు
  • వ్యాపారంలో నిజాయితీ పాటించాలి
  • తెలియని విషయాల వెంట పడకూడదు; కళ్ళు, చెవులు, మనసు అన్నింటికీ ప్రశ్న ఉంటుంది
  • భూమిపై గర్వంతో, అహంకారంతో నడవకూడదు
  • పొగరుబోతుతనం, బడాయి కోరడం అల్లాహ్‌కు ఇష్టం కాదు

ఈ బోధనలన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ మానవాళికి అందించాడని, వాటిని ఆచరించడం ద్వారా సత్ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ మార్గంలో జీవించినవారికి మరణానంతరం శాశ్వత స్వర్గం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖుతుబుద్దీన్, అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793