చైనా మాంజా బారిన పడ్డ ఏఎస్ఐ… మెడకు తీవ్ర గాయం
హైదరాబాద్, జనవరి 13: నిషేధిత చైనా మాంజా వాడకం నగరంలో మరోసారి ప్రాణాపాయ పరిస్థితిని సృష్టించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గాలిపటాల మాంజాతో జరుగుతున్న ప్రమాదాలు వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం ఉదయం ఉప్పల్‌లో చైనా మాంజా తగిలి ఓ ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయమైంది.
పోలీసుల వివరాల ప్రకారం… నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు ప్రస్తుతం నాంపల్లి నుమాయిష్ బందోబస్తు విధుల్లో ఉన్నారు. మంగళవారం ఉదయం ఉప్పల్‌లోని తన నివాసం నుంచి ద్విచక్ర వాహనంపై విధులకు బయలుదేరిన ఆయన, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్‌నగర్ వద్దకు చేరుకున్న సమయంలో గాలిలో వేలాడుతున్న చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు చుట్టుకుంది.
వాహనం వేగంగా ఉండటంతో మాంజా బలంగా గొంతులోకి చొచ్చుకెళ్లి తీవ్ర గాయానికి కారణమైంది. రక్తస్రావం కావడంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి పోలీసులు వెంటనే ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం ఏఎస్ఐ నాగరాజు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
ఈ ఘటనతో మరోసారి చైనా మాంజా ఎంత ప్రమాదకరమో స్పష్టమైందని, ప్రజలు నిషేధిత మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment