మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మణికంఠుడు
కేరళలోని ప్రముఖ శబరిమల క్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పొన్నంబలమేడు కొండలపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమివ్వడంతో శబరిమల కొండలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగిపోయాయి.
దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల సన్నిధానం, పంబ, ఇలువంకల్ తదితర ప్రాంతాలకు భారీగా తరలివచ్చారు. పందళం రాజప్రసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్ర తిరువాభరణాలు అయ్యప్ప స్వామికి అలంకరించిన అనంతరం నిర్వహించిన మహా హారతి సమయంలో జ్యోతి స్వరూపుడు సాక్షాత్కరించడంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా “స్వామియే శరణం అయ్యప్ప” అనే శరణుఘోషలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. మకరజ్యోతి దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.
అధికారుల అంచనాల ప్రకారం నేడు సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు మకరజ్యోతిని దర్శించుకున్నారు. ఈ పవిత్ర దర్శనంతో మండల–మకరవిళక్కు తీర్థయాత్రలో ప్రధాన ఘట్టం ముగిసింది.

Post a Comment