-->

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హనీపాస్ట్ – బ్లాక్‌మెయిల్ దంపతుల అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హనీపాస్ట్ – బ్లాక్‌మెయిల్ దంపతుల అరెస్ట్


కరీంనగర్ పట్టణ పరిధిలోని ఆరేపల్లిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వల వేసి పలువురిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాలుగా ఆరేపల్లిలోని శ్రీ సాయి అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న భార్యాభర్తలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ఫోటోలు పోస్టు చేస్తూ యువకులు, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని వల వేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు వంద మందికి పైగా వారి మోసానికి బలయ్యారని పోలీసులు తెలిపారు.

వలలో పడ్డ బాధితులను అపార్ట్మెంట్‌కు రప్పించి, నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడేవారని సీఐ తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి గత ఏడాది నుంచి నిందితులతో సన్నిహితంగా ఉండగా, అతని వద్ద నుంచి కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.

లక్షల్లో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు

డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తామని, ప్రాణహానీ చేస్తామని కూడా బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు.

ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేష్‌తో కలిసి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం కరీంనగర్‌లోని టేస్టీ దాబా వద్ద అనుమానాస్పదంగా ఫోన్ మాట్లాడుతుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నేరాన్ని ఒప్పుకున్న నిందితుల వద్ద నుంచి వారు ఉపయోగించిన కారు, మొబైల్ ఫోన్‌లు, అందులోని నగ్న వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మంచిర్యాల జిల్లాకు చెందినవారని పోలీసులు గుర్తించారు.

నిందితులను కోర్టులో హాజరుపరిచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించినందుకు సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేష్‌ల బృందాన్ని ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793