చైనా మాంజా బీభత్సం – బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గొంతు కోయడం వలన మృతి
సంగారెడ్డి, జనవరి 14: సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది ప్రాంతంలో చైనా మాంజా మరో ప్రాణాన్ని బలిగొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకు చైనా మాంజా తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడిని బిహార్ రాష్ట్రానికి చెందిన అద్వైక్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
చైనా మాంజా వినియోగం పూర్తిగా నిషేధించబడినప్పటికీ, అక్రమంగా విక్రయాలు కొనసాగుతుండటం వల్ల ఇలాంటి ప్రాణాంతక ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
చైనా మాంజా కారణంగా ఇప్పటికే పలువురు గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుండటంతో, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment