చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి చేరుకున్న వనదేవత
మేడారం మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. తన భక్తుల కష్టాలను దూరం చేసి, వారికి సల్లంగ చూడాలనే సంకల్పంతో వనదేవత సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి కదిలివచ్చి మేడారం గద్దెపై కొలువుదీరింది. చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించిన భక్తజనులు ఆనందపారవశ్యంతో “జై సమ్మక్క.. జైజై సమ్మక్క” అంటూ జయజయధ్వానాలు చేశారు.
రెండోరోజైన గురువారం రాత్రి సరిగ్గా 9:47 గంటలకు డోలు–సన్నాయి వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో మహాజాతర పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోగా, సమ్మక్క రాకతో నలుగురు దేవతలు ఆధునికీకరించిన గద్దెలపై కొలువుదీరారు. దీంతో జాతర పరిపూర్ణతను సంతరించుకుంది.
సమ్మక్కను గద్దెపైకి చేర్చే కార్యక్రమంలో గిరిజన పూజారులు తెల్లవారుజాము నుంచే నిమగ్నమయ్యారు. మేడారంలోని సమ్మక్క గుడి ప్రాంగణాన్ని శుభ్రపరిచి, పేడతో అలికి, తోరణాలు కట్టి, ముగ్గులు వేశారు. అనంతరం అడవికి వెళ్లి వనాన్ని తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకు డప్పుచప్పుళ్ల మధ్య వనం తీసుకువస్తుండగా, సమ్మక్క గుడి సమీపంలోని బొడ్రాయి వద్ద మహిళలు నీళ్ల బిందెలతో ఎదురొచ్చి పూజారుల కాళ్లు కడిగి మంగళహారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
మధ్యాహ్నం పూజారి సిద్ధబోయిన మునేందర్ ఇంట్లో ఆడేరాలు (పసిడి కుండలు) సిద్ధం చేసి, డోలు వాయిద్యాల నడుమ వాటిని సమ్మక్క గుడికి తరలించారు. గుడిలో పూజా సామగ్రిని శుద్ధి చేసి, అనంతరం మేకలు, కోళ్లను బలిచ్చారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో పాటు మాల్యాల సత్యం, సిద్ధబోయిన మునేందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్ తదితర పూజారులు చిలుకలగుట్టకు బయలుదేరారు.

Post a Comment