-->

బస్సులో ప్రయాణిస్తున్న యువతికి ఇనుప రాడ్లు గుచ్చుకొని మృతి

బస్సులో ప్రయాణిస్తున్న యువతికి ఇనుప రాడ్లు గుచ్చుకొని మృతి


సంగారెడ్డి: సాధారణ ప్రయాణం ఆమె ప్రాణాలు తీసింది. అతివేగం, నిర్లక్ష్యానికి మరో అమాయక జీవితం బలైంది. ట్రాలీ ఆటోలో తీసుకొస్తున్న ఫ్లెక్సీలకు సంబంధించిన ఇనుప రాడ్లు బస్సును ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి పట్టణ శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వైపు వెళ్తుండగా, వైకుంఠపురం దాటిన అనంతరం కొద్ది దూరంలో మరో బస్సును అతివేగంగా ఓవర్టేక్ చేయబోయిన ట్రాలీ ఆటో బస్సును ఢీకొట్టింది. ఆటోలో ఫ్లెక్సీలతో పాటు లోడ్ చేసిన ఇనుప రాడ్లు ఒక్కసారిగా బస్సులోకి దూసుకొచ్చి ప్రయాణికులను గాయపరిచాయి.

ఈ ప్రమాదంలో నారాయణఖేడ్ మండలం చిమ్మనాపురానికి చెందిన పూజ (18) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. పూజ బాసర ట్రిపుల్ ఐటీలో విద్యనభ్యసిస్తోంది. పటాన్ చెరువులో స్నేహితులను కలిసిన అనంతరం స్వగ్రామం నారాయణఖేడ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అదే సమయంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

అకాల మరణంతో పూజ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒక్కసారిగా తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793