బడ్జెట్‌కు వేళాయెరా! 2026–27 కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు
న్యూఢిల్లీ: కొత్త కేంద్ర బడ్జెట్‌కు వేళ ఆసన్నమైంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రతిసారీలా ఈసారి కూడా వేతన జీవులు, సీనియర్ సిటిజన్లు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వ్యాపార, పారిశ్రామిక వర్గాలు పన్ను విధానాల్లో సంస్కరణలు వస్తాయా? అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
అంతర్జాతీయ సవాళ్ల నడుమ బడ్జెట్
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, స్టాక్–కమోడిటీ మార్కెట్ల ఒడిదుడుకుల నేపథ్యంలో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. ఆషామాషీ నిర్ణయాలతో పరిస్థితి చక్కబడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వృద్ధి–ఉద్యోగాలే ప్రాధాన్యం
ఈసారి బడ్జెట్‌లో
- స్థిరమైన ఆర్థిక వృద్ధి,
- ఉద్యోగాల కల్పన,
- తయారీ రంగానికి ప్రోత్సాహంకీలకంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
దేశీయ మార్కెట్‌లో వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతున్న నేపథ్యంలో దాన్ని పెంపొందించే చర్యలు తప్పనిసరిగా అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ సంస్కరణలకు ప్రభుత్వం నడుం బిగించాలని సూచిస్తున్నారు.
విదేశీ పెట్టుబడులే అసలు పరీక్ష
భారత స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీని ప్రభావం రూపాయి మారకం విలువపై కూడా పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ మదుపరుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఆర్థిక మంత్రికి ఎదురైన అసలైన పరీక్షగా వారు పేర్కొంటున్నారు.
ఐటీ స్లాబుల సవరణపై డిమాండ్లు
ఆదాయ పన్నుకు సంబంధించి కొత్త విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణం మరియు ఉద్యోగ మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా
- గరిష్ఠ పన్ను స్లాబు పరిమితి పెంచాలి,
- స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలి,
- టీడీఎస్‌లో సడలింపులు ఇవ్వాలిఅనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రూ.24 లక్షలకుపైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధించడంపై పునర్విచారణ అవసరమని వేతన జీవులు కోరుతున్నారు.
డిజిటలైజేషన్, ఏఐకి చేయూత
కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నూతన ఆవిష్కరణలకు బడ్జెట్‌లో తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత్‌లో ఏఐకి గొప్ప భవిష్యత్తు ఉందని, యువత దీనిని అందిపుచ్చుకుంటే దేశానికి విస్తృత లాభాలు చేకూరుతాయని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు.
పన్నుల్లో తేడాలు వద్దు: ఎస్బీఐ చీఫ్
బ్యాంక్ డిపాజిట్లు, ఈక్విటీ పెట్టుబడులపై విధిస్తున్న పన్నుల్లో వ్యత్యాసం ఉండటం సరికాదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. డిపాజిట్లపై గరిష్ఠంగా 30 శాతం పన్ను ఉండగా, ఈక్విటీ లాభాలపై తక్కువ పన్ను ఉండటం వల్ల నిధులు బ్యాంకుల నుంచి ఈక్విటీలకు మళ్లుతున్నాయని తెలిపారు. ఇది బ్యాంకుల నిధుల లభ్యతపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment