-->

విధి నిర్వహణలో వీరమరణం… ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ సెల్యూట్

విధి నిర్వహణలో వీరమరణం… ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ధైర్యానికి సీపీ సజ్జనార్ సెల్యూట్


గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో దుండగుల దాడికి గురై ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (Soumya) వీరమరణం పొందారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ మాఫియాను అడ్డుకునే ప్రయత్నంలో దుండగులు ఆమెను కారుతో ఢీకొట్టి పరారయ్యారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, శనివారం రాత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. జనవరి 23న చోటు చేసుకున్న ఈ ఘటనలో దాదాపు తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం ఆమె కన్నుమూశారు.

సౌమ్య మృతిపై నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్తు రక్కసిని అంతం చేసేందుకు ఆమె చూపిన సాహసం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. రక్తమోడుతున్నా వెనకడుగు వేయకుండా విధి నిర్వహణలో నిలబడిన ఆమె త్యాగం నిరుపమానమని కొనియాడారు. గంజాయి మాఫియా వాహనంతో తొక్కించి కిరాతకంగా హత్య చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆ వీరనారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించారు.

ఈ ఘటన కేవలం ఒక విషాద సంఘటన మాత్రమే కాదని, గంజాయి మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో తెలియజేసే హెచ్చరికగా సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల ముప్పు సమాజానికి ఎంతటి ప్రమాదకరంగా మారిందో సౌమ్య మరణం చాటిచెబుతోందని ఆయన ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో అమరురాలైన సౌమ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మాదక ద్రవ్యాలపై పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793