-->

12వ కేంద్ర బడ్జెట్‌లోనూ తెలంగాణకు గుండు సున్నానే కల్వకుంట్ల కవిత

8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తీరని అన్యాయం 12 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా 12వ ఏడాదికీ తెలంగాణకు గుండు సున్నానే ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌పై ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తరచుగా చెప్పే “కో-ఆపరేటివ్ ఫెడరలిజం” మాటలకు, కేంద్రం ఆచరణకు ఏమాత్రం పొంతన లేదని వ్యాఖ్యానించారు.

విభజన చట్టం హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కిక్కురుమనకుండా ఉండటం దురదృష్టకరమని కవిత అన్నారు. స్థిరత్వం, క్రమశిక్షణ, వృద్ధి అంటూ నినాదాలు చేసే బీజేపీ పెద్దలు తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

8 మంది ఎంపీలను ఇస్తే తిరిగి ఇచ్చింది గుండు సున్నా

తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది లోక్‌సభ ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్రానికి మాత్రం నిధుల బదులు పెండింగ్ ఫైళ్లే ఇచ్చారని కవిత విమర్శించారు.

రూ. 34,367 కోట్లతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లకు నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణకు ఇవ్వాల్సిన 50 శాతం కేంద్ర వాటాను ఇప్పటికీ విడుదల చేయలేదని తెలిపారు.

కొత్త రైల్వే లైన్లకు క్లియరెన్సులు ఇవ్వకపోవడంతో పాటు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారని మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన ఐఐఎం, 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలు ఇప్పటికీ మంజూరు కాలేదన్నారు.

విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి అవసరమైన పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా ఏవీ ఇవ్వలేదని ఆరోపించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాల జాబితా చాంతాడంతా ఉందని కవిత తెలిపారు. ప్రధాని మోడీ చెప్పే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే తెలంగాణ ప్రయోజనాలను కాలరాయడమేనా? అని ఆమె ప్రశ్నించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793