-->

భర్తపై రూ.66 లక్షల బీమా… డబ్బుల కోసం హత్యకు కుట్ర

 

భర్తపై రూ.66 లక్షల బీమా… డబ్బుల కోసం హత్యకు కుట్ర

ఖమ్మం రూరల్‌, మార్చి 9: అనారోగ్యంతో ఉన్న భర్త త్వరలోనే చనిపోతాడని భావించి అతని పేరుతో భారీ జీవిత బీమా చేయించిన భార్య… అతడు చనిపోకపోవడంతో బీమా డబ్బుల కోసం చివరికి హత్య చేయించిన ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది.

ఖమ్మం రూరల్‌ సీఐ ముష్కరాజు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి (52) ఆటో డ్రైవర్‌. అతనికి భార్య ప్రశాంతి ఉంది. రవి మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతడు త్వరలోనే చనిపోతాడని భావించిన ప్రశాంతి, గత ఏడాది జూలైలో రవి పేరిట రూ.66 లక్షల జీవిత బీమా చేయించింది. ఈ బీమాను తన బావమరిది దేశబోయిన శ్రీనివాస్‌తో కలిసి ఓ ఏజెంట్‌ ద్వారా చేయించింది.

అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో బీమా డబ్బులు పొందేందుకు ప్రశాంతి హత్యకు కుట్ర పన్నింది. దేశబోయిన శ్రీనివాస్‌, అతని స్నేహితులు జోగి రాజ్‌కుమార్‌, జోగి వెంకటేశ్‌, జోగి రాంబాబులతో కలిసి రవిని చంపితే వచ్చే డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది.

పథకం ప్రకారం ఈ నెల 2న శ్రీనివాస్‌ రవిని ఆటోలో తీసుకెళ్లి అధికంగా మద్యం తాగించాడు. అనంతరం ఖమ్మం రూరల్‌ మండలం వీవీ పాలెం శివారులో వదిలేసి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి జోగి వెంకటేశ్‌కు చెందిన కారును జోగి రాజ్‌కుమార్‌ వేగంగా నడుపుతూ వచ్చి వెనుక నుంచి రవిని ఢీకొట్టాడు. ఆ సమయంలో ఎవరైనా వస్తున్నారా అని గమనించేందుకు జోగి రాంబాబును కాపలా పెట్టారు.

ఘటన అనంతరం రాజ్‌కుమార్‌ కారును తనగంపాడు గ్రామంలో సురేశ్‌ ఇంటి వద్ద ఉంచి ప్రమాదం జరిగిందని చెప్పి వెళ్లిపోయాడు. వీవీ పాలెం వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతిచెందాడని సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. రవి భార్య ప్రశాంతే హత్యకు కుట్ర పన్నినట్లు తేలడంతో ఆమెతో పాటు మిగతా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793