కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్
హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 12లోగా అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉండగా, స్పీకర్ ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు కూడా అనర్హత నుంచి విముక్తి కల్పించడంతో మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.
ఇటీవల భారత రాష్ట్ర సమితి టికెట్‌పై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పేర్లు ఉన్నాయి.
స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ముందుగా తెలంగాణ హైకోర్టును, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం సుప్రీంకోర్టు నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం వెల్లడించాలని స్పీకర్‌ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Post a Comment