-->

మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం


హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు ముమ్మరంగా సిద్ధమవుతుండగా, హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను మీ సేవ కేంద్రాల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. అలాగే 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చు.

విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సూచించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, గురుకుల పాఠశాలల నుంచి 60,139 మంది, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,50,015 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకునేలా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.

పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైన దశ కావడంతో విద్యార్థులు పాఠ్యాంశాలను బాగా చదివి, అర్థం చేసుకుని రాయాలని పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. అలాగే పరీక్షల పారదర్శకత కోసం ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల ముందు తెరవాలని అధికారులు ఏర్పాట్లు చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793