గంజాయి మత్తులో పోలీస్ సిబ్బందిపై యువకుల దాడి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో శనివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంతులాల్ పోడు తండాలో గ్రామంలో వాగ్వివాదం చోటుచేసుకోవడంతో 100 కాల్ అందుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
వివాదాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించారు. పోలీస్ సిబ్బంది పరిస్థితిని రికార్డ్ చేస్తుండగా, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పి, పోలీసులపై యువకులు దాడికి దిగారు.
ఈ దాడిలో పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకునేలోపే దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.
తదనంతరం గ్రామంలో వివాదానికి సంబంధించిన కుటుంబ సభ్యులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్సై తిరుపతి, పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో గ్రామానికి చెందిన నలుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది.

Post a Comment