-->

జూపార్క్‌లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు

జూపార్క్‌లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు


హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం నెహ్రూ జూలాజికల్ పార్క్లో కొత్తగా అరుదైన జంతువులు చేరడంతో సందర్శకుల సందడి పెరిగింది. తాజాగా జూపార్క్‌లోకి రెండు మగ మాండ్రిల్స్ (కోతి జాతికి చెందిన అరుదైన జంతువులు) చేరడం విశేషం. ప్రస్తుతం వీటి వయసు సుమారు 23 నెలలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ మాండ్రిల్స్‌ను టాటా స్టీల్ జూలాజికల్ పార్క్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రతిగా ఇక్కడి జూపార్క్ నుంచి ఒక జత ఆఫ్రికన్ సింహాలను జంషెడ్‌పూర్‌కు పంపించారు.

జూకు వచ్చిన వెంటనే ఈ జంతువులను 45 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి, పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే వీటిని ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసి, గురువారం నుంచి ప్రజల సందర్శనకు అనుమతించారు.

ఈ అరుదైన మాండ్రిల్స్‌ను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు జూపార్క్‌కు తరలివస్తున్నారు. సాధారణంగా కూడా జూపార్క్‌కు మంచి స్పందన ఉండగా, ఇప్పుడు కొత్త ఆకర్షణ చేరడంతో రద్దీ మరింత పెరిగింది. వీకెండ్‌లో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వేసవి నేపథ్యంలో జూపార్క్‌లో తాగునీటి సదుపాయాలను విస్తరించడంతో పాటు భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి విభాగంలో సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు.

మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని బహదూర్‌పురాలో ఉన్న ఈ జూపార్క్ దాదాపు 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రతి సోమవారం జూపార్క్ మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. టికెట్ ధరలు పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50గా నిర్ణయించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793