వికారాబాద్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
వికారాబాద్ జిల్లాలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉన్న Sugna Metals Limited స్టీల్ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది.
స్టీల్ ప్లాంట్‌లోని బట్టీ ఒక్కసారిగా పేలడంతో భారీ మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న పలువురు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. అయితే గాయాల తీవ్రతపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
పేలుడు అనంతరం కంపెనీ యాజమాన్యం ఎవరినీ లోపలికి అనుమతించకుండా ఆంక్షలు విధించింది. మీడియా ప్రశ్నించగా, లారీ టైర్ పేలిందని పేర్కొంటూ అసలు విషయాన్ని దాచే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తరువాతే గాయాల వివరాలు, ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Post a Comment