-->

TG Inter Results 2026: ఏప్రిల్ 10 లోపు ఫలితాలు విడుదలకు సిద్ధం

TG Inter Results 2026: ఏప్రిల్ 10 లోపు ఫలితాలు విడుదలకు సిద్ధం


హైదరాబాద్, మార్చి 24: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలకు వేగంగా కసరత్తు ప్రారంభించింది.

రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం శరవేగంగా కొనసాగుతోంది. బోర్డు లక్ష్యప్రకారం ఏప్రిల్ 3 నాటికి వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక ప్రక్రియలు పూర్తి చేసి, ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. అధికారికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి తుది తేదీ ఖరారు కానుంది. మొత్తంగా ఏప్రిల్ 10 లోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.

ఈసారి ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి జవాబు పత్రాన్ని రెండు సార్లు మూల్యాంకనం చేసే విధానాన్ని అమలు చేస్తోంది. తుది ఫలితాల ప్రకటనకు ముందు పూర్తి స్థాయి పరిశీలన నిర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది.

వాల్యుయేషన్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. అనధికార వ్యక్తుల ప్రవేశంపై పూర్తి నిషేధం విధించారు.

అలాగే, వాల్యుయేషన్ విధుల్లో పాల్గొంటున్న అధ్యాపకులకు రెమ్యూనరేషన్ పెంచారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 25 నుంచి 30 పేపర్లు మాత్రమే దిద్దేలా పరిమితి విధించడం ద్వారా మూల్యాంకనం నాణ్యతను మెరుగుపరచాలని అధికారులు భావిస్తున్నారు.

మొత్తానికి, ఈసారి ఇంటర్ బోర్డు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా రికార్డు సమయంలో ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793