ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
గురువారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శంకర్ గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఈ మేరకు ఆర్డీవో ఉమారాణి అధికారికంగా ప్రకటన చేస్తూ, శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు, నిరుపేద కుటుంబం కావడంతో ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగతంగా మరో రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
గత 25 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసిన శంకర్ గౌడ్‌కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. భార్య హేమలత దివ్యాంగురాలు కావడం కుటుంబ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చింది. సొంతిల్లు లేకపోవడంతో కుటుంబ సభ్యులు స్వగ్రామమైన ముత్తోజిపేటకు తరలివెళ్లి అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
శంకర్ గౌడ్ అంత్యక్రియలకు ఆర్టీసీ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు.

Post a Comment