కీసరలో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు – ఆరుగురు అరెస్ట్
కీసర రూరల్: లైంగిక కోరికలు తీర్చుతామంటూ స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుని నగ్న ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న హనీట్రాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కీసర పరిధిలో కలకలం రేపింది.
మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్‌కు చెందిన కసుమ కార్తి, రాంరాజ్, బబ్లూ సింగ్, కందుల సాయితేజ, గండ్ల శ్రవణ్, మాచర్ల పవన్ కల్యాణ్, చెన్నకేశవుల పవన్ కల్యాణ్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు “Grindr” అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా స్వలింగ సంపర్కులను సంప్రదించి, లైంగిక కోరికలు తీర్చుతామని నమ్మబలికేవారు.
యాప్ ద్వారా సంప్రదించిన బాధితులను ఓఆర్‌ఆర్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాలకు పిలిచి, అక్కడ బలవంతంగా దుస్తులు విప్పించి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసేవారు. అనంతరం ఆ ఫొటోలను బయటపెడతామని బెదిరిస్తూ వారి వద్ద ఉన్న నగదు, బంగారు వస్తువులు దోచుకునేవారు.
ఈ నెల 6న ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ముఠా వ్యవహారం బయటపడగా, నిందితుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు బబ్లూ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసు, Maruti Swift Dzire కారు, Vespa Scooter స్కూటీ, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment