అసలు నోట్లు ఇస్తే మూడు రెట్లు నకిలీ నోట్లు..
భీమవరం: అసలు నోట్లు ఇస్తే మూడు రెట్లు నకిలీ నోట్లు ఇస్తామని అమాయకులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
సీఐ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం, భీమవరం పట్టణానికి చెందిన కె. శ్రీజోగ శివశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని కాకినాడ జిల్లా బిక్కవోలు మండలం రెడ్డికాపవరం గ్రామానికి చెందిన కొవ్వూరి గోపీచంద్రరెడ్డి, జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన వేముల మోహనసాయి సంప్రదించారు. అసలు డబ్బులు ఇస్తే మూడు రెట్లు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికారు.
అయితే, ఇదే ముఠా గతంలో మరో వ్యక్తిని రూ.5 లక్షల పేరుతో మోసం చేసినట్లు గుర్తించిన శివశంకర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ప్లాన్ ప్రకారం వల పన్నారు.
శివశంకర్ రూ.3 లక్షలు తీసుకువస్తానని చెప్పగా, నిందితులు రూ.9 లక్షల నకిలీ నోట్లు ఇస్తామని ఒప్పుకుని ఏఎంసీ మార్కెట్ యార్డు గెస్ట్‌హౌస్ సమీపంలో కలవాలని చెప్పారు. నిర్ణీత సమయానికి అక్కడికి వచ్చిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.9 లక్షల విలువైన డమ్మీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కట్టలపై కొన్ని అసలు రూ.500 నోట్లు మాత్రమే ఉండగా, మిగతావి నకిలీగా తేలాయి.
అలాగే నిందితులు ప్రయాణిస్తున్న బ్రీజా కారులో తనిఖీ చేయగా, రూ.2 కోట్ల విలువైన డమ్మీ కరెన్సీ నోట్లు రెండు బాక్సుల్లో (400 బండిల్స్) లభించాయి. ఆ నోట్లపై “Children’s Bank” అనే పేరు ఉండటంతో అవి పూర్తిగా నకిలీ నోట్లుగా నిర్ధారణ అయింది.
పోలీసులు మొత్తం రూ.2.09 కోట్ల డమ్మీ నోట్లతో పాటు బ్రీజా కారు, రెండు నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఈ ముఠాకు డమ్మీ నోట్లు సరఫరా చేస్తున్న జంగారెడ్డిగూడెంకు చెందిన బర్రె సుధీర్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment