పొలంలో తవ్వకాల్లో బయటపడ్డ పురాతన నాణేల కుండ.. భద్రాద్రిలో కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బిజీ కొత్తూరులో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పొలం చదును చేసే పనుల్లో భాగంగా ఓ రైతు జేసిబితో తవ్వకాలు జరుపుతుండగా అకస్మాత్తుగా బరువుగా ఏదో తగిలింది. పరిశీలించగా అది ఒక పురాతన మట్టి కుండగా తేలింది.
ఆ కుండను తెరిచి చూడగా అందులో సుమారు 70కి పైగా పురాతన నాణేలు ఉండటంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ నాణేలను అక్కడ పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు కొంతమంది తీసుకెళ్లినట్లు సమాచారం. నాణేల పంపకాల విషయంలో వారి మధ్య తలెత్తిన వివాదం చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఓ వ్యక్తి వద్ద ఉన్న రెండు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో ఈ నాణేలు రాగితో తయారు చేసినవిగా గుర్తించారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ నాణేలు 14వ శతాబ్దానికి చెందిన బహుమనీ సుల్తానులు కాలానికి చెందినవిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు చారిత్రక ప్రాధాన్యత నెలకొంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నాణేలను సంబంధిత పురావస్తు శాఖకు అప్పగించే ప్రక్రియలో ఉన్నారు. గతంలో కూడా ఇదే బిజీ కొత్తూరు ప్రాంతంలో బంగారు నాణేలు బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని సమగ్ర తవ్వకాలు చేపడితే మరిన్ని విలువైన చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment