జర్నలిస్టులు ఏప్రిల్ 6లోపు అప్లై చేసుకోండి – స్పెషల్ కమిషనర్ ప్రియాంక
హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఈ నెల 6వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేసి వివరాలు వెల్లడించారు.
అక్రెడిటేషన్ కోసం అప్లై చేసుకునే జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి సిఫార్సు లేఖ, సంబంధిత పత్రికల్లో ప్రచురితమైన పేపర్ కటింగులు, విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్ జర్నలిస్టులు తమ రచనలు ప్రచురితమైన కటింగులతో పాటు, సంబంధిత ఎడిటర్ నుంచి ధృవీకరణ లేఖను జత చేయాలి.
అదేవిధంగా, దరఖాస్తుదారులు తాము ఇతర వృత్తుల్లో—సొసైటీ చైర్మన్, డైరెక్టర్, ప్రభుత్వ ఉద్యోగి, న్యాయవాది, సర్పంచ్ వంటి పదవుల్లో లేరని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పూర్తిచేసిన దరఖాస్తును ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడంతో పాటు, హార్డ్ కాపీని సంబంధిత డిపి ఆర్ఓ కార్యాలయాలకు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ రెండు సార్లు సమావేశమై జీఓ అమలు, విధి విధానాలపై చర్చించిందని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

Post a Comment