-->

సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్? కేంద్ర రైల్వే శాఖ ఆమోదం

సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్? కేంద్ర రైల్వే శాఖ ఆమోదం


హైదరాబాద్: మార్చి 29: రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలక స్థానం కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్త రైల్వే లైన్ కల త్వరలోనే నిజం కానుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆర్థిక మద్దతు కూడా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

డోర్నకల్ నుంచి గద్వాల వరకు సుమారు 296 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 5,330 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ రైల్వే లైన్ పూర్తయితే సూర్యాపేట జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడనుంది. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు దక్కనుంది. ముఖ్యంగా బొగ్గు గనులు, సిమెంట్ పరిశ్రమలు, విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం అవుతుంది.

ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పరిధిలో మేళ్లచెర్వు, మఠంపల్లి ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్లు ప్రధానంగా సిమెంట్ పరిశ్రమలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే కొత్త లైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు ప్రత్యక్ష రైలు సౌకర్యం లభించనుంది.

ఈ రైల్వే మార్గం మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్–బెంగళూరు మార్గాన్ని, వరంగల్ మీదుగా హైదరాబాద్–విజయవాడ మార్గాన్ని అనుసంధానించనుంది. డోర్నకల్ నుంచి ప్రారంభమయ్యే ఈ లైన్ ఖమ్మం రూరల్, కుసుమంచి, పాలేరు, మోతె మీదుగా సూర్యాపేట చేరుకుంటుంది. అక్కడి నుంచి నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, భూత్పూర్ మీదుగా గద్వాల వద్ద ముగుస్తుంది. అలాగే నల్గొండ వద్ద నడికుడి–గుంటూరు రైల్వే లైన్‌తో కూడా అనుసంధానం కల్పించబడుతుంది.

ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793