పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్.. రోడ్డు ప్రమాదంలో మృతి
నిర్మల్ జిల్లా కడెం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మాసాయిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ లహరిక వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, ఆమెను వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తరలించేందుకు కారులో బయలుదేరారు. అయితే ప్రాణాలు కాపాడాలని వేగంగా వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.
ఈ ఘటనలో లహరికతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం కదలని పరిస్థితి రావడంతో, తీవ్ర గాయాలతో ఉన్న లహరికను మరో వాహనంలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
కానీ ప్రమాదం వల్ల ఆలస్యం కావడం, గాయాలు తీవ్రమవడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలోనే లహరిక మృతి చెందారు.
ఈ వార్త తెలిసిన వెంటనే మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లహరిక ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటి? ప్రమాదంలో ఇతర కోణాలున్నాయా? అన్న విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment