-->

కరీంనగర్‌లో దారుణం: కన్నతండ్రే కాలయముడు

కరీంనగర్‌లో దారుణం: కన్నతండ్రే కాలయముడు


కరీంనగర్ జిల్లా: ఏప్రిల్ 04: జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డలకు అండగా ఉండాల్సిన తండ్రే కసాయిగా మారి కవల ఆడపిల్లలను బావిలోకి తోసేసి హత్య చేసిన విషాద సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ అమానవీయ ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులను షాక్‌కు గురిచేసిన ఈ ఘటనలో, ఆడపిల్లలు పుట్టారని కుటుంబంలో నెలకొన్న విభేదాలే కారణంగా తెలుస్తోంది.

పోలీసుల సమాచారం ప్రకారం, జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలంకు ఆరేళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మౌనికతో వివాహమైంది. ఈ దంపతులకు గీతాంశీ, గీతాన్విక (4) అనే కవల కుమార్తెలు ఉన్నారు. అయితే ఆడపిల్లలు పుట్టారనే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను పొలానికి తీసుకెళ్లి, ముందుగా గడ్డి మందు తాగించి అనంతరం బావిలోకి తోసేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బావిలో గాలింపు చేపట్టగా గీతాంశీ మృతదేహం బయటపడింది. మరో బాలిక గీతాన్విక కోసం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఘటన స్థలాన్ని ఏసీపీ విజయ్‌కుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు, ఆడపిల్లలపై ఇంకా కొనసాగుతున్న వివక్షపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793