కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
ఆయన అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13వ తేదీన తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నారు.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. చేరిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 7న కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనతో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొననుంది.
జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల కోటలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అనుభవజ్ఞుడైన నాయకుడి చేరికతో ఉమ్మడి జిల్లాలో పార్టీకి కొత్త ఊపిరి లభిస్తుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఈ చేరిక అనంతరం జగిత్యాలలోనే పార్టీ ప్లీనరీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఈ సభలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ పరిణామంతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి ఇది గట్టి దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment