తెలంగాణలో మద్యం ధరలు పెంపు? మేలో కీలక నిర్ణయం అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 06: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు తెలంగాణలో మద్యం ధరలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. మద్యం మరియు బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అంతర్జాతీయ పరిస్థితులతో పాటు స్థానిక ఉత్పత్తి సమస్యలు కలిసి ధరల పెంపుకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో గాజు సీసాల తయారీ తీవ్రంగా దెబ్బతింది. దీనివల్ల సీసాల కొరత ఏర్పడి, తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి.
దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి తగ్గడంతో కొన్ని యూనిట్లు మూతపడగా, మరికొన్ని ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. దీంతో ఖాళీ సీసాల ధరలు కూడా పెరిగి మద్యం తయారీ సంస్థలపై అదనపు భారం పడుతోంది.
ఇక రాష్ట్రంలో మద్యం ధరల సమీక్ష గడువు కూడా పూర్తవ్వడం మరో ముఖ్య కారణంగా మారింది. చివరిసారిగా 2023 మేలో ధరలు సవరించగా, ప్రస్తుతం కొత్త రివ్యూకు సమయం దాటిపోయింది.
తయారీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించి 12 నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని కోరాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని తాము భరించలేమని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సమగ్రంగా పరిస్థితులను విశ్లేషిస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా మే నెలలో కొత్త ధరలు ప్రకటించే అవకాశం ఉంది.
అదేవిధంగా, మద్యం ధరలను స్లాబ్ విధానంలో పెంచే ప్రణాళికపై కూడా చర్చ జరుగుతోంది. బాటిల్ పరిమాణం, బ్రాండ్ కేటగిరీ, ధర శ్రేణుల ఆధారంగా విభజించి పెంపు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక బీర్ల విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వేసవిలో డిమాండ్ పెరగడం, క్యాన్ల ధరలు అధికం కావడం వల్ల మరోసారి ధరలు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment