-->

భార్య, ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

 

అక్రమ సంబంధం కోసం అమానుషం… భార్య, ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

హైదరాబాద్, మార్చి 31: నగరంలోని మూసాపేట పరిసర ప్రాంతంలో సంచలనానికి దారితీసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించిన భర్త, కట్టుకున్న భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్–స్రవంతి దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాల పాటు సజావుగా సాగిన వారి దాంపత్య జీవితం, గత రెండేళ్లుగా ప్రవీణ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కలత చెందింది.

అక్రమ సంబంధం కారణంగా భార్య స్రవంతిపై ప్రవీణ్ తరచూ వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పలుమార్లు పంచాయతీలు నిర్వహించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల నర్సంపేట ప్రాంతంలో జరిగిన పంచాయతీలో కూడా ఇకముందు బాధ్యత తనదేనని బాండ్ పేపర్ రాసి, భార్యను తనతో తీసుకెళ్లాడు.

అయితే ఈ ఘటన ముందే పథకం ప్రకారం జరిగినదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ప్రవీణ్, మంగళవారం రాత్రి భార్య స్రవంతిని చిత్రహింసలకు గురిచేసి, బిర్యానీలో విషం కలిపి ఇద్దరు కుమారులతో పాటు ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం ముగ్గురిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించే ప్రయత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Blogger ఆధారితం.