నర్సింగ్ విద్యార్థినిపై దారుణం.. సామూహిక అత్యాచారం
వరంగల్ జిల్లా, ఏప్రిల్ — వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గిరిజన తండాలో గురువారం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 21 ఏళ్ల గిరిజన నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందగా, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలు నర్సంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ANM శిక్షణ పొందుతూ, గ్రామంలోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండగా, సోదరుడు మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సమీపంలో పెదనాన్న కుటుంబం ఉన్నప్పటికీ, ఘటన జరిగిన రాత్రి ఆమె తన ఇంట్లోనే నిద్రించింది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొందరు యువకులు గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె ముందుగానే తన బంధువులకు తెలిపినట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం ఆమె ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, ముందుగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉరి వేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమీపంలోని మొక్కజొన్న పొలాల్లో ఈ దారుణం జరిగి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసుల స్పందన సరిగా లేదని ఆరోపిస్తూ, కుటుంబ సభ్యులు మరియు స్థానికులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే సమయంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. నిష్పక్షపాత విచారణ జరిపి, దోషులను చట్టం ముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరణానికి గల అసలు కారణాలు, అత్యాచారం జరిగిన విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment