వేవ్ కంపెనీ పేరుతో భారీ మోసం… పదిమంది ఏజెంట్లు అరెస్ట్
నీలగిరి, ఏప్రిల్ 13: అధిక లాభాలు, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మల్టీలెవల్ మార్కెటింగ్ (MLM) ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేవ్ (WAVE) పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్న పదిమంది ఏజెంట్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండ అదనపు ఎస్పీ జి. రమేష్ ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
వీఐపీఎస్ కంపెనీ మోసం… వందల కోట్ల దోపిడి
VIPS Group of Companies పేరుతో వినోద్ తుకారాం ఖుటే అనే వ్యక్తి ఏజెంట్లను నియమించి ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా సేకరించి మోసం చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారులకు లాభాలు ఇవ్వకుండా డబ్బుతో పరారయ్యాడు.
మళ్లీ ‘WAVE’ పేరుతో మోసం ప్రయత్నం
ఇటీవల అదే ముఠా ‘WAVE’ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు యత్నించింది. శనివారం నీలగిరిలోని లక్ష్మీ గార్డెన్స్ సమీపంలో సమావేశం నిర్వహించి, “మళ్లీ పెట్టుబడి పెడితే పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయి” అంటూ అమాయకులను నమ్మించే ప్రయత్నం చేశారు.
అరెస్టైన నిందితులు
పోలీసులు పట్టుకున్న వారిలో:
- కానాల లక్ష్మీనారాయణ రావు (వనస్థలిపురం, హైదరాబాద్)
- పున్నం బాలకృష్ణ (మర్రూర్, నకిరేకల్)
- ఉయ్యాల శ్రీనివాస్ (ఎలికట్టె, చిట్యాల)
- కురాకుల రమేష్ (నల్లగొండ)
- గాజుల మహేష్ (దోరేపల్లి, కనగల్)
- కోల కుశలయ్య (కాకులకొండారం)
- మాదగొని సైదులు (నల్లగొండ)
- ముడుసు ఉమాశంకర్ (మునుకుంట్ల, కట్టంగూర్)
- ఓరుగంటి శంకర్ (అప్పాజీపేట)
- గుడపూరి లింగస్వామి (కట్టంగూర్)
- గూడూరు అఖిల్ (కొత్త కంపెనీలో పాత కస్టమర్)
ముఖ్య నిందితులు పరారీలో
పోలీసుల దర్యాప్తులో WAVE కంపెనీకి సంబంధించి:
- సీఈవోగా వినోద్ తుకారాం ఖుటే
- సౌత్ ఇండియా డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా కల్యాణ్ చక్రవరి
- డైరెక్టర్లుగా సుమిత్ పురాంక్, గుమ్మల సత్యనారాయణ, గుమ్ముల అభినాష్ ఉన్నట్లు తెలిసింది.
ఇవరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల హెచ్చరిక
ఇలాంటి అధిక లాభాల ఆశ చూపించే పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ సూచించారు. ఎవరైనా మోసపోతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, నల్లగొండ రూరల్ ఎస్‌ఐ సైదాబాబు, ఏఎస్‌ఐ రాజు, సిబ్బంది జానకిరాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment