పోలీస్ అధికారిగా శివధర్ రెడ్డి సేవలు వెలకట్టలేనివి: సీవీ ఆనంద్
హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గురువారం పదవీ విరమణ పొందుతున్న శివధర్ రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. పోలీస్ శాఖ భవిష్యత్తు కార్యాచరణపై తన దిశానిర్దేశాన్ని కూడా స్పష్టం చేశారు.
32 ఏళ్ల పాటు పోలీస్ అధికారిగా శివధర్ రెడ్డి అందించిన సేవలు అమూల్యమని సీవీ ఆనంద్ ప్రశంసించారు. ఆయన పనితీరును తాను సమీపంగా గమనించానని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నక్సలిజం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో శివధర్ రెడ్డి సేవలు విశేషమని పేర్కొన్నారు. మావోయిస్టులు పెద్దఎత్తున లొంగిపోయేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ ఆపరేషన్లలో సాధించిన విజయాలు, భారీగా ఆయుధాల స్వాధీనం వంటి చర్యలు రాష్ట్ర భద్రతకు ఎంతో దోహదపడ్డాయని తెలిపారు.
పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం కూడా శివధర్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆనంద్ గుర్తుచేశారు.
ఈ సందర్భంగా నూతన డీజీపీ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సవాళ్లుగా మారాయని చెప్పారు. జనాభా పెరుగుదల, వేగవంతమైన పట్టణీకరణ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వంటి విభాగాల పనితీరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
2016 నుంచి తనతో కలిసి పనిచేసిన అధికారుల అనుభవాన్ని వినియోగించుకుంటూ, టీమ్‌వర్క్‌తో ముందుకు సాగుతామని సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడటంలో పోలీస్ శాఖ బాధ్యత కీలకమని, అందరూ కలిసికట్టుగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Post a Comment