సింగరేణి మెయిన్ వర్క షాప్ కాపర్ వైర్ మాయం అధికారులపై విజిలెన్స్ దృష్టి
కొత్తగూడెం ప్రతినిధి: బ్రిటిష్ కాలం నాటి విలువైన కాపర్ వైర్ మాయం ఘటన సింగరేణిలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించగా, ఇది సాధారణ దొంగతనం కాదని, సంస్థలోనే ఉన్న కొంతమంది అధికారుల ప్రమేయంతో జరిగిన “ఇంటి దొంగతనం” అని అనుమానాలు బలపడుతున్నాయి.
సంవత్సరాలుగా ఈ వ్యవహారం వెలుగులోకి రాకపోవడం వెనుక పెద్దల హస్తం ఉందని కార్మికులు చర్చించుకుంటున్నారు. డీవైఎస్ఈ స్థాయి అధికారి మాత్రమే కాకుండా, ప్రస్తుత విజిలెన్స్ విభాగంలో ఉన్న ఉన్నతాధికారి, ఒక ఫోర్‌మెన్, అలాగే ఈ అండ్ ఎం విభాగంలో పని చేసి రిటైర్డ్ అయిన మాజీ డైరెక్టర్ కలిసి స్క్రాప్ రూపంలో కాపర్‌ను బయటకు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీవైఎస్ఈ అధికారిపై తీవ్ర ఆరోపణలు
కాపర్ వైర్ మాయం ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీవైఎస్ఈ స్థాయి అధికారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సంస్థను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే భక్షకులుగా మారడం, కొనుగోళ్లలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకోవడం, కింది సిబ్బందిపై అధికారం ప్రదర్శించడం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ, తన పలుకుబడితో తప్పించుకుంటూ వచ్చినట్లు సమాచారం.
సస్పెన్షన్ భయంతో బదిలీ ప్రయత్నాలు
ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమవడంతో, నివేదిక తనకు వ్యతిరేకంగా వస్తే సస్పెన్షన్ తప్పదని భావించిన డీవైఎస్ఈ అధికారి ముందస్తుగా బదిలీ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి ఇతర ఏరియాకు మారితే సస్పెన్షన్ నుంచి తప్పించుకోవచ్చని భావిస్తూ తన పరిచయాలను వినియోగిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.
రక్షణకు రంగంలోకి విజిలెన్స్ ఉన్నతాధికారి?
ఈ కుంభకోణంలో భాగస్వామ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఉన్నతాధికారులు, ముఖ్యంగా విజిలెన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి, డీవైఎస్ఈ అధికారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అతను నోరు విప్పితే మరిన్ని వివరాలు బయటపడే అవకాశముందని భావించి, కేసును లోపలే సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కార్మికుల ఆగ్రహం
కోట్ల రూపాయల విలువైన కాపర్ వైర్ మాయం అయిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని కుంభకోణాలకు ఇది దారితీస్తుందని కార్మికులు హెచ్చరిస్తున్నారు. సింగరేణి సంస్థ ఆస్తులను తమ సొంతంగా భావించే అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు.
తదుపరి చర్యలపై ఉత్కంఠ
ప్రస్తుతం విజిలెన్స్ నివేదిక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారిని:
- సస్పెండ్ చేస్తారా?
- బదిలీ చేస్తారా?
- లేక అదే స్థానంలో కొనసాగిస్తారా?
అన్నది సింగరేణి ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Post a Comment