విద్యుత్ వైర్ తెగిపడి బైక్ దగ్ధం – యువకుడికి తీవ్ర గాయాలు
లింగంపేట, ఏప్రిల్ 23: లింగంపేట మండలంలోని నాగారం తండాలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్టీ లైన్‌కు చెందిన విద్యుత్ వైర్ అకస్మాత్తుగా తెగిపడి బైక్‌పై పడడంతో బైక్ పూర్తిగా దగ్ధమవగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల వివరాల ప్రకారం, తండాకు చెందిన జాదవ్ వంశీ పంటను ఆరబెట్టేందుకు అవసరమైన తార్పాలిన్ కవర్ల కోసం బైక్‌పై బోనాల గ్రామానికి బయలుదేరాడు. తండా సమీపానికి చేరుకోగానే విద్యుత్ లైన్ వైర్ ప్రమాదవశాత్తు తెగి అతని బైక్‌పై పడింది. దీంతో వంశీకి తీవ్ర విద్యుత్ షాక్ తగిలి దూరంగా ఎగిరి కిందపడ్డాడు. షాక్ ప్రభావంతో బైక్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వంశీని లింగంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం కామారెడ్డి ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఏఈ హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ ఘటన స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఈ ప్రమాదానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నాగారం తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్మెన్ హైమద్, ఏఎల్ఎం రవిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని పలుమార్లు తెలియజేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.
దీనిపై స్పందించిన ఏఈ హరీష్ రావు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తండాలో విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

Post a Comment