చెత్తకుప్పలో ఆధార్, డ్రైవింగ్ లైసెన్సులు… పోస్టల్ శాఖ నిర్లక్ష్యం
మెదక్ జిల్లాలో పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య పత్రాలు చెత్తకుప్పలో పడేయబడిన ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
కౌడిపల్లి మండలం శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న బట్టమ్మ ఆలయ ప్రాంగణంలో ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, లెటర్లు, ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లు చెత్తకుప్పలో కనిపించాయి. శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.
సాధారణంగా ప్రభుత్వ శాఖల నుంచి పోస్టాఫీసుకు వచ్చే ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ముఖ్య పత్రాలను సంబంధిత వ్యక్తులకు సురక్షితంగా అందించడం పోస్టల్ సిబ్బంది బాధ్యత. అయితే ఈ ఘటనలో అవి నిర్లక్ష్యంగా పారేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో పోస్టల్ శాఖ పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Post a Comment