ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు కార్మికులు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని Uttar Pradesh హమీర్‌పూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. బెట్వా నదిపై నిర్మాణంలో ఉన్న భారీ వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.
హమీర్‌పూర్ జిల్లా కురారా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్కందర్ పర్సాని నుంచి నైతి గ్రామం వరకు బెట్వా నదిపై కొత్త వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి కూడా కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా, శుక్రవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. తీవ్ర తుఫాను, బలమైన ఈదురు గాలులు వీచడంతో నిర్మాణంలో ఉన్న వంతెన భాగాలు కూలిపోయాయి.
భారీ షట్టరింగ్, స్లాబ్‌లు, పిల్లర్లు ఒక్కసారిగా కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడటంతో వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం అనంతరం స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. చీకటి మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగినప్పటికీ, జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

Post a Comment